పెద్ద చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లిన కూతురు ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న చూసే అవకాశం లేక ఆవేదనతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ నాగార్జున కాలనీలో నివసించే లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన (22) చెన్నైలో బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లింది. చికాగో నగరానికి సమీపంలో ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎలా రార్ట్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. కళాశాలకు వెళ్లి మెట్రో రైలులో తన నివాసానికి చేరుకునే క్రమంలో మెట్రోస్టేషన్ మెట్లపై భాగం నుంచి కిందపడి తీవ్రంగా గాయపడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. స్పందన స్నేహితులు అందించిన వివరాల ప్రకారం భారత కాలమానం ప్రకారం మే 31న 25 అడుగుల ఎత్తు నుంచి కింద పడటంతో తలతోపాటు పక్కటెముకలు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. నస్పూర్లో నివసిస్తున్న శ్రీనివాస్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ, ఇద్దరు కూతుళ్లను చదివిస్తున్నారు.తల్లిదండ్రుల కలను నెరవేర్చే ఉద్దేశంతో కష్టపడి అమెరికా వెళ్లిన స్పందన ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పార్క్ రిడ్జోని అడ్వొకేట్ లూథరన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తమకు పాస్పోర్టు, వీసా లేకపోవడంతో పాటు, అక్కడికి వెళ్లే ఆర్థిక స్తోమత లేక బిడ్డను చూసుకునే అవకాశంలేక అల్లాడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు జరిగిన ప్రమాదంలో చేతికి కాలికి తీవ్ర గాయాలయ్యాయని చేయి సరిగ్గా పని చేయడం లేదన్నారు. తన కూతురికి దాతలు బాసటగా నిలవాలని శ్రీనివాస్ వేడుకుంటున్నారు.ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కోరుతూ గురువారం కలెక్టర్ కుమార్ దీపకన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నానని చెప్పారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు అండగా ఉంటానని ఓదార్చారని తెలిపారు. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా ఈరోజు వచ్చిందని, వీసా కోసం మళ్లీ ఎంత సమయం పడుతుందో తెలియదని, తమ పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం,దాతలు ఆదుకోవాలని కోరారు.
