కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
మంత్రి వివేక్ వెంకటస్వామి పై కాంట్రాక్టర్ వ్యాఖ్యలు అర్ధరహితం…
రాష్ట్రంలో నేడు కనిపిస్తున్న ఆర్థిక ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదని, గత పదేళ్ల బి అర ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని క్యాతనపల్లి మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ అన్నారు.రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ , మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశంలో క్యాతనపల్లి ఆర్ ఓ బి నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లుల అంశంపై ఒక కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని,వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్ ఓ బి పనులకు 2018 ఆగస్టులో అప్పటి బి అర ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్ పిలవబడిందని, 2019లో భూసేకరణ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు పనుల స్థలం అప్పగించారని గుర్తు చేశారు. రెండు సంవత్సరాల్లో పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు 2021 నాటికే ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, 2023 వరకు కూడా పూర్తికాకపోవడం వెనుక ఉన్న కారణాలను అప్పటి పాలకులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయని, ప్రమాదాలు, ప్రాణనష్టాలు సంభవించాయని పేర్కొన్నారు. ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు అధికారంలో ఉన్న బి అర ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 2023లో చెన్నూరు ప్రజలు గడ్డం వివేక్ వెంకటస్వామి ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. మంత్రి వివేక్ ఆర్ ఓ బి పనులపై ప్రత్యేక దృష్టి సారించి, ల్యాండ్ లూజర్స్ సమస్యలను పరిష్కరించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి,పెండింగ్ అంశాలను క్లియర్ చేయడం ద్వారా పనులు వేగంగా పూర్తి చేయించారని తెలిపారు.ప్రస్తుతం ఆర్ ఓ బి ద్వారా వేలాది మంది ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని, దీనికి మంత్రి చొరవ, పట్టుదల ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
బిల్లుల చెల్లింపుల విషయానికి వస్తే, మంత్రి ఫైనాన్స్ శాఖకు కన్సెంట్ లెటర్ ఇచ్చారని కాంట్రాక్టర్ స్వయంగా చెప్పడం గమనార్హమన్నారు.అంటే బిల్లుల చెల్లింపుల కోసం మంత్రి గారు కృషి చేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బిల్లుల కోసం ప్రయత్నించిన నాయకుడిపైనే ఆరోపణలు చేయడం రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న ప్రచారంగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల భారంలోకి నెట్టారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టులు చేపట్టినా, అనేక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యమైన సందర్భాలు, డి ఏ బకాయిలు, పి ఆర్ సి సమస్యలు, సి పి ఎస్ అంశాలపై ఉద్యోగులు చేసిన ఆందోళనలురాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు గత ప్రభుత్వ అప్పులపై వడ్డీలు చెల్లిస్తూ, మరోవైపు రైతులు,మహిళలు, విద్యార్థులు, పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు

